27-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, (డిసెంబర్ 27): ఆంధ్రప్రదేశ్ లో ఏటా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి.. అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పండుగకు గ్రామాల్లో హడావిడి అంతాకాదు. కోడి పందాలు హైలెట్ అవుతుంటాయి. ఎంతో సందడిగా, ఆటపాటలతో, అందాల ముగ్గులతో పిండివంటలతో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగకుగాను ప్రతి ఒక్కరూ గ్రామాలు చేరుకుంటారు. అయితే కరోనాతో ఇప్పుడు మరోమారు పండగపై నీలినీడలు కమ్ముకుంటాయా అన్న ఆందోళన వస్తోంది. కొత్త వేరియంట్ వ్యాప్తితో ఇప్పుడు మళ్లీ భయాలు మొదలయ్యాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి కోసం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న తిరిగి స్కూళ్లు తెరుచుకుంటాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేయనుండగా.. 80 రోజులు సెలవులు ఉంటాయి. జూనియర్ కళాశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక తెలంగాణలో 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఇంటర్ కాలేజీలకు ఇవే సెలవులు దినాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే భోగి పండుగా జనవరి 14న వచ్చింది.
ఆ రోజు ఆదివారం కావడం, 15న సంక్రాంతి పర్వదినాన సోమవారం కావడంతో ఒకరోజు సెలవు మిస్ అవుతున్నారు. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. మరోవైపు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఈ క్రమంలో కొత్తగా జెఎన్-1 వేరియంట్ చాపకిందనీరులా విస్తిస్తోంది. రోజురోజుకూ క్రమంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో గ్రామాలకు వెళ్లాలనుకునే వారిలో భయాలు మొదలయ్యాయి.