27-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి, (డిసెంబర్ 27): కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ప్లై ఓవర్ నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. కేంద్రం జలజీవన్ మిషన్ కింద 6000 కుళాయి కనెక్షన్లు ఇచ్చిందన్నారు. టూరిజం అభివృద్ధి కోసం రాజమండ్రి నుంచి లంబసింగి హైవే వేస్తున్నామన్నారు.
కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పంచుతున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నమైన స్థితిలో ఉందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని పురందేశ్వరి తెలిపారు. ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చవద్దని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర నాయకత్వం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో ఏపీ అవినీతిమయంగా మారిందని పురందేశ్వరి పేర్కొన్నారు. ఇకపోతే తమకు ఏపిలో పరిస్థితి అనుకూలంగా ఉందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడ పోటీ చేయాలన్నది ఆధారపడి ఉంటుందని అన్నారు. ఏపిలో బిజెపి గెలుపు అవకాశాలు ఉన్నాయని అన్నారు.