28-12-2023 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, (డిసెంబర్ 28): నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం... మేడం అంటే దూరం అయిపోతము. అదే గుర్తు పెట్టుకోండి. సీతక్క అంటేనే మీ అక్క మీ చెల్లిలాగా కలిసి పోతాం. పదవులు శాశ్వతం కాదు.. విలువలు, మంచి పనులే శాశ్వతం. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన. ప్రజలకు ఏ అవసరం ఉన్నా మాతో స్వేచ్చగా చెప్పుకోవచ్చని అంటూ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం జామినిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. ప్రజాపాలన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జైనథ్ మండలం ఆదివాసీ గ్రామం జామినిలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ కు ఇన్చార్జ్ మంత్రిగా సీఎం తనకు బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తనను మేడమ్ అని సంబోదిస్తున్న అక్కడి కిందిస్థాయి ఉద్యోగులతో .. తానెప్పటికీ సీతక్కనేనని, తనను సీతక్క అనే పిలవాలంటూ సూచించారు.
ఆదిలాబాద్ ను కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకుంటుందని.. జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాపాలనలో భాగంగా జామినికి రావడం.. కొమురంభీం గడ్డపై నుండి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం ఆదివాసీ బిడ్డగా తనకు మరింత తృప్తినిచ్చిందని తెలిపారు. ప్రజాపాలన లో ఆరు గ్యారంటీలు దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, సిబ్బందితో పాటు పార్టీ కార్యకర్తలు కూడా అన్ని విదాలుగా సాయం చేస్తారని తెలిపారు.
ఆదివాసీ గూడాల్లో నిరక్షరాస్యులకు స్థానిక యువత సాయం చేయాలని.. దరఖాస్తులు నింపే విషయంలో స్థానిక యువత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గతం ప్రభుత్వంలో లాగా జిరాక్స్ సెంటర్ల వద్ద మీసేవల వద్ద లైన్లు కట్టి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని.. ప్రజల వద్దకే అధికారులు, సిబ్బంది వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామని.. కొత్త రేషన్ కార్డ్ పక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.