28-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 28): తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం అభయహస్తం దరఖాస్తులను అధికారులు ప్రారంభించారు. ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు అందజేస్తున్నారు. అయితే ప్రజాపాలన.. అభయ హస్తం అప్లికేషన్ ఫామ్ ల విషయంలో సరికొత్త దందాకు కొందరు దళారులు తెరతీశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కో ఫారంను రూ.50 నుంచి రూ.100 రూపాయలకు అమ్ముతున్నారు.
ప్రతీ కౌంటర్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పట్టించుకునే వారు లేకపోవడంతో పేద ప్రజలు తప్పదని దరఖాస్తు ఫామ్ లను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్ లను కూడా కొందరు దళారులు, జిరాక్స్ సెంటర్లు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలకు సంబంధించి ఫామ్ ల విషయంలో దళారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పేద ప్రజలు కోరుతున్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులను అధికారులు ప్రజలకు అందజేస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. పర్యవేక్షణ కోసం మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది.