29-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 29): తెలంగాణలో పరీక్షల షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. గురువారం ఇంటర్ పరీక్షలకు నంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పదో తరగతికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. తెలంగాణలో వదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జరిపిన సమీక్షలో పరీక్షల షెడ్యూల్ దాదావుగా ఖరారైనట్లు సమాచారం.
ప్రభుత్వం కూడా ఇందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం పదో తరగతి షెడ్యూల్ కు నంబంధించి అధికారికంగా ప్రకటనరానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2024 మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తర్వాత వెంటనే షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. 2024, ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురువారం వెల్లడించింది. మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్.. మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు జరగనున్నాయి.
ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల (జనరల్/వొకేషనల్ కోర్సులు) విషయానికొస్తే.. ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రాక్టికల్స్ను రెండు సెషన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు.