29-12-2023 RJ
సినీ స్క్రీన్
రవితేజ హీరోగా నటించిన 'వెంకీ' ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెలిసిందే! 2004లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాటలు, డైలాగ్లు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం. అంతగా పాపులర్ అయిన చిత్రమిది. ఇప్పుడీ కామెడీ థ్రిల్లర్ ఈ నెల 30న రీ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా శ్రీను వైట్ల ఓ వీడియో పోస్ట్ చేశారు. 'వెంకీ నాకెంతో ఇష్టమైన సినిమా. నా కెరీర్ కు ప్రత్యేకమైనది కూడా. 2004లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం రీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఆ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వొస్తుంటుంది. దాని షూటింగ్ అంతా ఎంతో సరదాగా సాగింది. రవితేజ వల్లే సినిమా అంత బాగా వచ్చింది. ఆయన నాపై నమ్మకంతో సినిమా ఓకే చేశారు.
యువత ఎదుర్కొనే సవాళ్లు.. వారి భావోద్వేగాలతో తెరకెక్కిన 'వెంకీ' ఎవరిన్ సినిమా.. అందులో బ్రహ్మానందం, ఎవీఎస్ పోషించిన పాత్రలకు ఎంతో ఆదరణ లభించింది. 2004లో వచ్చిన ఈ చిత్రం రీ రిలీజ్ టికెట్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అందరికీ కృతజ్ఞతలు' అని వీడియోలో పేర్కొన్నారు.
ప్రస్తుతం రవితేజ 'ఈగల్' చిత్రంలో నటిస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు.