30-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 30): అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం అధమ స్థానానికి పడిపోయిందని టిడిపి అరోపించింది. అయిదేళ్ల చంద్రబాబు చేసిన అభివృద్ధిని అధోగతిపాటుచేసారని టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు అన్నారు. చంద్రబాబు పాలన అద్వితీయం కాగా జగన్ పరిపాలన అధ్వాన్నమని చెప్పి తీరాలన్నారు. కొత్త సంవత్సరంలో ఇక తమ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని, జగన్ అవినీతి పాలనను ఎండగడతామని అన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ తన ఐదేళ్ల పాలనలో నవ్యాంధ్రను అధమ స్థానానికి చేర్చారన్నారు.
రాజధాని అన్నది లేకుండా తలలేని మొండెంగా ఎపిని చేర్చారని అన్నారు. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో సాధించిన అభివృద్ధికి జాతీయంగాను, అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయని అన్నారు. గూండాలు, రౌడీ షీటర్లు, హంతకులు, వైన్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా అందరు కల కలిసి పొలిటికల్ మాఫియాగా ఆవిర్భవించి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని అన్నారు. అరాచకం ప్రబలిపోతుందని రాజకీయ కక్షసాధింపు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
ఇంతటి దారుణ పాలన ఎక్కడా ఎప్పుడూ కానరాదన్నారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అధఃపాతాళంలోకి నెట్టివేయబడిందన్నారు. బహుశా దేశంలో మరే రాష్ట్రమూ ఇటువంటి విషమ పరిస్థితిని ఎదుర్కొని ఉండదన్నారు. విడివడ్డ ఎపిని దుర్భర స్థితి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఒడ్డుకు చేర్చింది. ఆంధ్రప్రదేశని తక్కువ సమయంలో మళ్ళీ ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్లో రెండోస్థానానికి తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుదే అని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి పెట్టుబడులను తీసుకుని వచ్చిన కారణంగా అమరావతి ఓ రూపుకు వచ్చిందన్నారు.
చంద్రబాబు పాలనలో సమాజంలోని అన్ని వర్గాలకు సమున్నత జీవన ప్రమాణాలు నెలకొల్పడానికి అవిశ్రాంత కృషి జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులలోనూ అయిదేళ్లలో దేశంలో మరే రాష్ట్రం సాధించ నంత వృద్ధి రేటును ఆంధప్రదేశ్ సాధించడం గర్వకారణం అన్నారు. ఆదాయ వనరులు పెంచి రాష్ట్ర భవిష్యత్ తీర్చిదిద్దడం కోసం గత ప్రభుత్వం చెయ్యని కృషి లేదన్నారు. పేదల అభ్యున్నతికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బలీయమైన ఆర్థిక శక్తిగా మలచడానికి చంద్రబాబు గత అయిదేళ్లు అవిరళ కృషి చేశారని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే అనుకూలమైన రాష్ట్రంగా నవ్యాంధ్రను మొదటి స్థానంలో నిలిపారు. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించడం ద్వారా చంద్రబాబు రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి బాటలు వేశారు. విభజన సమయంలో రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు లేవు. కానీ గత ప్రభుత్వ కృషితోనే అనేక భారీ పరిశ్రమలు రావడానికి బాటలు పడ్డాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. అన్నీ కోల్పోయిన రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించి లక్షల మందికి ఉపాధి కల్పించి అద్భుతాలు సృష్టించడం నవ్యాంధ్రలోనే సాధ్యమైందని అచ్చెన్నాయుడు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 70 శాతం పూర్తి చేయగా, మిగిలిన పనులను 2 శాతం కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చెయ్యలేదు. మరే ఇతర ప్రాజెక్టునూ పూర్తి చెయ్యలేదు. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు 10 లక్షల ఇళ్ళు నిర్మించగా, జగన్ ప్రభుత్వం ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేదు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు వేసిన పునాదులు అన్నీ కూల్చారని అన్నారు. రాజకీయ కక్ష, అసూయతో ప్రగతి బాట పట్టిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత జగన్ ని అన్నారు.
అభివృద్ధిని నిలిపివేసి ఆర్ధిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాళా అంచుకు చేర్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగింది. ఇంత అధ్వాన్న పాలనను అభివృద్ధి అని అభివర్ణించుకోవడం వైసిపికే చెల్లిందన్నారు.