30-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, (డిసెంబర్ 30): ఒక్క ఛాన్స్ అని జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇస్తే.. వారిని కోలుకోలేని దెబ్బకొట్టాడని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. జగన్ కోట్లు దోచుకున్నాడన్నారు. అయినా కుక్క తోక వంకర అన్నట్లుగా.. జగన్ మార్పు రాలేదన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి, మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడని తెలిపారు. నక్క వినయాలతో మొసలి కన్నీరు కార్చడంతో ప్రజలు కూడా నమ్మారన్నారు. సీబీఎన్ ఫోరం కార్యక్రమాలు.. జగన్ కుయుక్తులను తిప్పి కొట్టేలా ఉన్నాయని అభినందించారు.
ప్రజలను ఆలోచింప చేసేలా, చైతన్యం తీసుకొచ్చేలా అంశాల వారీగా సభలు ఏర్పాటు చేస్తున్నారని కితాబిచ్చారు. దళిత గళం పేరుతో జగన్ ఎస్సీ, ఎస్టీలకు మోసం చేసిన తీరును చక్కగా వివరించారని చెప్పారు. నందిగామలో తంగిరాల సౌమ్య వంటి మానవతావాదిని గెలిపించాలని కోరారు. జగన్ పాలనలో దళితులపై ఎన్ని దాడులు చేశారో అందరికీ తెలుసని, మహిళలు అని కూడా చూకుండా దారుణాలకు ఒడిగట్టారన్నారు. జగన్కు బుద్ధి చెప్పేందుకు రాష్ట్రంలో ఉన్న దళితులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అబద్దపు మాటలు, అసత్యాలు, వాగ్దానాలతో అసమర్ధ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను సాగనంపాలని ఆయన పేర్కొన్నారు.
2020-21 విద్యా సంవత్సరంలో విద్యాదీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బటన్లను నొక్కారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు.. జగన్ రూ.700కోట్లు ఎగనామం పెట్టారన్నారు. జగన్రెడ్డి విద్యాదీవెన పథకం... అబద్దాలు, మోసాలతో అమలవుతోందని విమర్శించారు. విద్యార్థిలోకానికి.. జగన్ రెడ్డి మొత్తం రూ.3,400 కోట్లు బాకీ పడ్డారని చెప్పారు. 2020-21లో ఒక త్రైమాసికం, 22-23లో మరో త్రైమాసికం ఫీజు, అలాగే 23-24లో రెండు త్రైమాసికాల ఫీజు కలిపి మొత్తం రూ.2,800 కోట్లు బకాయి పడ్డారన్నారు.
విద్యార్థులకు మేనమామ అని చెప్పుకొనే జగన్ రెడ్డి... వారి పాలిట కంసమామ అయ్యాడనానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. ఉత్తుత్తి బటన్ లు నొక్కి మోసగించిన జగన్ రెడ్డిని.. విద్యార్థి లోకం ఓటు అనే బటన్ నొక్కి బంగాళాఖాతంలో కలపాలని పట్టాభిరామ్ పిలుపునిచ్చారు.