30-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్టణం, (డిసెంబర్ 30): తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. అందుకే తాను వైసీపీ నుంచి జనసేనలో చేరానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వెల్లడించారు. ఇటీవల జనసేనలో చేరిన ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లు అమ్ముకున్నానని.. తన రాజకీయ భవిష్యత్ నాశనం కావడానికి వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణమని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించడమే తన లక్ష్యమని వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. వైసీపీలో గుడివాడ అమర్నాథ్ జాక్పాట్ తో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వంశీకృష్ణ యాదవ్ హెచ్చరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉన్న వారందరినీ జనసేనలో చేర్పిస్తానని, అందరికీ జనసేనలో సముచిత స్థానం కల్పిస్తానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అన్నారు.
త్వరలోనే విశాఖ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. విశాఖ సిటీలో ఎక్కడైనా పోటీ చేస్తానని జగన్ను అడిగానని.. కానీ గాజువాక నుంచే పోటీ చేయమన్నారని.. తాను చేయనని చెప్పానన్నారు. తనకు అవకాశం రాని చోట ఇంకొకరు మాట విన్నారన్నారు. తాను అడిగిన చోట సీటు ఇవ్వలేదనే పార్టీ మారానని.. తాను అడిగిన సీటు జనసేన ఇస్తుందని ఆశిస్తున్నట్లు వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు.