01-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 1): రాజధాని హైదరాబాద్ లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోగా, మరోవైపు యువత ఆనందాన్ని రెట్టింపు చేసేలా హోటళ్లు, పబ్లు, రిసార్టులు మిరుమిట్లు గొలిపేలా ఈవెంట్లు నిర్వహించాయి. అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందుబాబుల పనిపట్టారు.
గతానికి భిన్నంగా రాత్రి 8 గంటల నుంచే తనిఖీలు మొదలు పెట్టారు. ఎక్కడిక్కడ ఇంటికి వెళుతున్న వారిని ఆపి తనిఖీలు చేసారు. దీంతో పదిలోపే ఇంటికి సజావుగా వెళుతున్న వారు సైతం పట్టుబడ్డారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. అలాగే వాహనాలను స్వాధీనం చేసుకుని, సోమవారం సెలవు అంటూ వాహనాలను అప్పగించలేదు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో కలిసి 2700కుపైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 1500లకు పైగా కేసులు నమోదవగా, సైబరాబాద్ లో 1241 కేసులు ఉన్నాయి.
సైబరాబాద్ లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని ఓఆర్ఆర్ ను ఆదివారం రాత్రి 8 గంటలకే మూసివేశారు.
పీవీ ఎక్స్ప్రెస్ వేపై విమానం టికెట్ ఉన్నవారికి మాత్రమే అనుమతించారు. హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సవరం సందర్భంగా యువత హంగామా అంతాఇంతా కాదు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి రోడ్లపై యువత ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే పలువురు మందు పార్టీలు కూడా చేసుకున్నారు. మందు సేవించి రోడ్లపైకి వచ్చిన పలువురు మందుబాబులు పోలీసులకు చిక్కారు. న్యూఇయర్ రోజు పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో అనేక మంది మందుబాబులు పట్టుబడ్డారు.
పట్టుబడిన మందుబాబుల వివరాలను సోమవారం పోలీసులు మీడియాకు వివరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోని 1241 కేసులను సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. అందులో 1239 మంది పురుషులు కాగా ఇద్దరు మహిళలపై కేసు నమోదు అయ్యింది. ఎక్కువుగా 938 ద్విచక్ర వాహనాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలు 938, త్రీ వీలర్స్ 21, ఫోర్ వీలర్స్ 275, హెవీ వెహికల్స్ 7 మొత్తం 1241 కేసులు నమోదు అయ్యాయి.
పట్టుబడిన వారిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న వారు 382 మంది ఉండగా.. 26 సంవత్సరాలు నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఎక్కువగా మియాపూర్ లో 253 కేసులు నమోదు అయ్యాయి. అయితే డ్రగ్స్ కిట్ తో టెస్టులు చేసినప్పటికీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. న్యూసెన్స్, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.