01-01-2024 RJ
తెలంగాణ
ములుగు, (జనవరి 1): ఏటూరు నాగారంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు భగ్గుమన్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బైరి నరేష్ వాహనం కారణంగా ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. సోమవారం.. కోరేగావ్ సమావేశం కోసం బైరి నరేష్ ఏటూరు నాగారం వెళ్లాడు. అది తెలుసుకుని అక్కడికి చేరుకున్న అయ్యప్ప స్వాములు.. బైరి నరేష్ తో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే నరేష్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అయ్యప్ప స్వాములు వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో నరేష్ వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓఅయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. బాధితుడ్ని పోగు నర్సింహారావుగా గుర్తించారు. దీంతో నరేష్ ను అరెస్ట్ చేయాలంటూ స్వాములు అందోళన చేపట్టారు. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు.