01-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, (జనవరి 1): ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరులో సోమవారానికి నిరవధిక సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది. రాష్ట్ర కమిటి సభ్యులు బి. గోపీనాథ్ మాట్లాడుతూ కరోనా కాలంలో 'ఫ్రెండ్ లైన్ వారియర్స్' అని అభినందించి,
పారిశుధ్య కార్మికులు చేసే పని, ఎవరూ చేయలేరని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా మున్సిపల్ కార్మికులు వారి సమస్యలు, డిమాండ్లపై, నిరవధిక సమ్మె చేస్తున్నా, ఇంతవరకు పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదని, వారి డిమాండ్లపై వెంటనే పరిష్కారం చూపాలని లేనిపక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు.
సి.ఐ.టి.యు పట్టణ అధ్యక్షులు బి.వి. రమణయ్య మాట్లాడుతూ పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలని, చట్టబద్ధమైన సెలవులు రక్షణ, భద్రత సౌకర్యాలు సకాలంలో అందించాలని, మున్సిపల్ కార్మికుల అందరికి ఆదాయపరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ముఖ్యమంత్రి గారి హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి. రమేష్, ధారా కోటేశ్వరరావు, పెంచల ప్రసాద్, (పి.పి) శ్రామిక మహిళా సంఘం కార్యదర్శి ఎం. సంపూర్ణమ్మ, రాఘవయ్య, సీనయ్య, కొండయ్య, అరుణమ్మ, పెంచలమ్మ, సుబ్బమ్మ, పద్మమ్మ ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.