01-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 1): నాంపల్లి మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయన్నారు. నుమాయిష్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.
ఈ ఎగ్జిబిషన్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని, పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎంతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్ ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ నుమాయిష్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు.
ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యాసంస్థల్లో 30 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేసిందని కొనియాడారు. ఇక రాష్ట్ర ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ ను ఎంచుకున్నారని, రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తామని శ్రీధర్బాబు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రారంభంతో హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ సందడి మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 83వ నుమాయిష్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ కొనసాగనుంది. 2నుంచి ప్రజలను ఎగ్జిబిషన్ కు అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి పదిన్నర వరకు.. వీకెండ్స్ లో రాత్రి 11 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ ఫీజు 40 రూపాయిలుగా నిర్ణయించారు. ఈ ఏడాది ఎగ్జిబిషన్ లో దేశ నలుమూలల నుంచి 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇవ్వాల్టి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాంపల్లి పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీవీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అలాగే మెట్రో కూడా అర్థరాత్రి వరకు నడపనుంది.