01-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, (జనవరి 1): పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో అసంపూర్తిగా నిలిపేసిన ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని, ప్రతి ఎకరాకు గోదావరి జలాలను ఇచ్చినట్లు తెలిపారు.
2014 కంటే ముందు తెలంగాణలో 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండేవని, కానీ ఇప్పుడు 25 వేల మెగావాట్లకు పెంచామన్నారు. ఐటీ పరిశ్రమతోపాటు, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని అంశాల్లో ముందంజలో నిలిపామని చెప్పారు. కొత్త ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని మరింతగా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్వర్ణలత, రాజనర్సింగరావు, కొండయ్య, గజెల దేవరాజు, మ్లలెంకి శ్రీనివాస్, సాయికృష్ణ, గందె కల్పన, వైజయంతి పాల్గొన్నారు.
కరీంనగర్ లోని పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. వెలమ సంక్షేమ సంఘం అభివద్ధి కోసం తనవంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్ రావు, నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు.