01-01-2024 RJ
సినీ స్క్రీన్
మెగాస్టార్ చిరంజీవి 'బింబిసార' సినిమా దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక ఫాంటసీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై, చాలా సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించే ముందు ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా చేస్తున్నారని ప్రచారం సాగింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి ఈ సినిమా నుండి తప్పుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఫాంటసీ మూవీ అవటం, ఇందులో రానా వెయ్యబోయే పాత్ర అతను ముందు ముందు చెయ్యబోయే హిరణ్యకశిపుడి పాత్రతో పోలి ఉండటం అందుకు కారణం అని అంటున్నారు.
ఈ రెండు పాత్రలు ఒకే విధంగా కనిపిస్తాయని రానా అనుకోవటంతో చిరంజీవి సినిమా నుండి రానా తప్పుకున్నారని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. రానా తప్పుకోవడంతో చిత్ర నిర్వాహకులు వెంటనే అతనికి బదులు హిందీ నటుడు కునాల్ కపూర్ ని తీసుకున్నారని తెలిసింది. కునాల్ కపూర్ ఎక్కువ తెలుగు సినిమాలు చెయ్యలేదు, ఇంతకు ముందు నాగార్జున నాని లు నటించిన 'దేవదాస్' సినిమాలో ఒక పాత్ర చేసాడు.
అంతే తరువాత ఇప్పుడు ఈ చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు. రానా బదులుగా ఈ సినిమాలోకి వచ్చిన కునాల్ కపూర్ ఈ సినిమా కోసం షూటింగ్ కూడా మొదలెట్టేసాడు అని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణలో కునాల్ కపూర్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇతను ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు, ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.