01-01-2024 RJ
సినీ స్క్రీన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు గడిచిన ఏడాది ఎంతో ప్రత్యేకం. 'పుష్ప' మాస్ మసాలా చిత్రంలో ఉత్తమ నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి దాకా ఎవరూ సాధించలేని ఘనతను అల్లు అర్జున్ సాధించి చరిత్ర సృష్టించారు. ఈ మేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన ఓ ట్వీట్ చేశారు. గత ఏడాది తాను ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు.
అభిమానులు అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ.. 2023 అందించిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 'పలు విధాలుగా 2023 నాకెంతో ప్రత్యేకం. గడిచిన ఏడాది నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కృతజ్ఞతతో ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నా' అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం.. 'పుష్ప 2'తో బిజీగా ఉన్నారు బన్నీ. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా దర్శకుడు సుకుమార్ 'పుష్ప2'ను రూపొందిస్తున్నారు.
జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలైట్ గా ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప -2 విడుదల కానుంది.