05-01-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, (జనవరి 5): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు దట్టంగా అలుముకొని.. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనపడటం లేదు. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి ప్రభావంతో వృద్ధులు, చిన్నారులు, రైతులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన పొగమంచుతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదయాన్నే రహదారి సరిగ్గా కనబడక వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో నారింజ పండ్ల వాహనం బోల్తా పడింది. తాజాగా, సీతగొంది సమీపంలోనూ ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మరోవైపు, పొగమంచు కారణంగా శనగ, పత్తిపంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్లు, చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయాన్నే ఎక్కడ చూసినా చలిమంటలే దర్శనమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత పెరిగిందని.. ఉదయం వాకింగ్ సమయం కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతుందని పలువురు చెబుతున్నారు. ఓ వైపు చలి, మరోవైపు పొగమంచుతో ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అడవులు అత్యధికంగా ఉన్నాయి. దీంతో అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా చలి తీవ్రత పెరిగింది.
ఉదయం పూట పొగమంచు దట్టంగా అలుము కుంటోంది. దీంతో రహదారి సరిగ్గా కనబడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధారిలో 12.1, కెరమెరి 12.6, ధనొర 12.6, ఆసిఫాబాద్ 12.9, తిర్యాణి లో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అటు ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ లో 13.3, సోనాల 13.3, పొచ్చర 13.5, అర్లి (టి)13.8, నేరడిగొండ 14.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలోని పెంబిలో 13.3, కుబీర్ 14.0, జామ్ లో 14.8, బిరవెల్లిలో 15.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని నీల్వాయిలో 14.5, కొండాపూర్ 14.6, భీమారం 14.7, నెన్నెల్ 14.8, కోటపల్లిలో 15.0 డిగ్రీలుగా నమోదయ్యాయి.