05-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, (జనవరి 5): రాష్ట్రంలో అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తామని చెప్పిన సిఎం జగన్ ఆ మాటే మరిచారు. గత ఐదేళ్లుగా ఎక్కడా కనిపించని బ్రాండ్ల పేరుతో దండిగా డబ్బులు దండుకున్నారు. మద్యం ధరలపై మండిపడుతూ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా చూడాలి. మద్యనిషేధం ఏమయ్యిందని ఆమె ప్రశ్నిస్తున్నారు. అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడం, ఆపై మద్యం ధరలను భారీగా పెంచారు. మద్యం అలవాటును దూరం చేయటానికే ధరలను పెంచామని సమర్ధించుకున్నారు.
బ్రాండెడ్ మద్యం అమ్మకాలను ఆపి ఊరు పేరు లేని నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చి మద్యం సేవించే వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీశారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యం అక్రమంగా రావడం, ప్రభుత్వం అరికట్టలేక ధరలను కొంత తగ్గించి, పాత బ్రాండ్లను మరలా తీసుకు వచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలు మద్య నిషేధానికి విరుద్ధంగా, గందరగోళంగా ఉన్నాయి. మద్యం దుకాణాల వద్ద జరుగుతున్న అక్రమాలు అంతా ఇంతా కాదు. కోవిడ్ కాలంలో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించి నడిపారు.
డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేదు. అందుకు సహేతుక కారణాలు చెప్పలేక పోయారు. భవిష్యత్తులో మద్యం అమ్మకాల ఆదాయాన్ని అధిక మొత్తంలో చూపించి భారీగా బ్యాంకు రుణాన్ని తీసుకున్నారు! నగదు లావాదేవీలలో భారీ అవకతవకలతో ఇప్పుడు ఆ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు పెడతామంటున్నారు! మద్య నిషేధం అమలుకు చిత్తశుద్ధి ఉంటే ఇన్ని విన్యాసాలు అవసరమా అన్న విమర్శలను పట్టించుకోలేదు. ఇలాంటి మోసపూరిత విధానాలతో పాలకులు ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. మొత్తంగా ఎపిలో మద్యనిషేధం పేరుతో ప్రభుత్వం బాగానే గడించింది. అలాగే అడ్డమైన బ్రాండ్లను తెచ్చి భారీగానే దోచుకున్నారు.