05-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, (జనవరి 5): విజయవాడ పటమటలోని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. తమ 24 డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి ఏపీ సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వచ్చిన వారిని వచ్చినట్టే అడ్డుకున్నారు. చుట్టుపక్కల దుకాణాలను సైతం మూసివేయించి ఎక్కడికక్కడ వారిని అరెస్టు చేశారు.
కొందరిని ఠాణాలకు, మరికొంతమందిని ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాలుకు తరలించారు. గత నెల 20 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గోడు వెల్లబోసుకునేందుకు వచ్చిన తమను పోలీసులతో అణచివేతకు గురిచేస్తున్నారన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వారి సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.