05-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 5): కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ యువతి పాలిట మృగాడయ్యాడు. లైంగికంగా వేధిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. చివరికి భరించలేని బాధితురాలు, అమ్మా.. నన్ను నాన్న ఇలా చేస్తున్నాడంటూ తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ మందలించింది. ఇక దిక్కు తోచని స్థితిలో తండ్రి బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె బయటకు రాగా.. అక్కడ కూడా మరో మృగాడు వేటాడాడు.
తండ్రి నుంచి తప్పించుకునేందుకు ఆమె వేసిన అడుగులు మరింత ప్రమాదంలోకి నెట్టేశాయి. రైలులో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమాయణం సాగినా, ఉపాధి ఆశతో మరో యువకుడి వెంట వెళ్లి మోసపోయింది. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.బీహార్ కు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చి కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కుమార్తె (18) తొమ్మిదో తరగతి వరకూ చదువుకుంది. కుటుంబీకులు కరోనా కారణంగా చదువు మాన్పించడంతో ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంటోంది.
ఈ క్రమంలో కొంతకాలంగా తండ్రి లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దంటూ కుమార్తెను బెదిరించాడు. అయితే, తండ్రి ఇలా చేస్తున్నాడంటూ కుమార్తె తన తల్లికి చెప్పగా ఆమె పట్టించుకోలేదు. తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కట్టడి చేసింది. దీంతో తండ్రి బారి నుంచి బయటపడాలని ఆమె అనుకుంది. గతేడాది దీపావళికి వీరి కుటుంబం బీహార్ నుంచి నగరానికి రైలులో వస్తున్న సమయంలో అదే రాష్ట్రానికి చెందిన సంతోష్ అనే యువకుడితో రైలులో ఆమెకు పరిచయం ఏర్పడింది.
అదే సమయంలో ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను షేర్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇద్దరూ ఇన్ స్టాలో చాట్ చేసుకునేవారు. ఈ క్రమంలోనే అతను బడంగ్ పేట గాంధీనగర్ లో ఉన్నట్లు చెప్పాడు. పరిచయం కాస్త ప్రేమగా మారగా.. గత నెల 26న సంతోష్ కలవాలని కోరడంతో సదరు యువతి సికింద్రాబాద్ వెళ్లింది.
చెప్పకుండా బయటకు వెళ్లినందుకు తనను కొడతారనే భయంతో ఆమె మళ్లీ తిరిగి సికింద్రాబాద్ స్టేషన్ కే వెళ్లిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకుని సంతోష్ కు కాల్ చేసింది. సంతోష్ ఆమెను తన ఇంటికి రమ్మని పిలిచాడు. రవి సాయంతో అతని ఇంటికి వెళ్లగా.. మరుసటి రోజు ఆమెను తన ఇంటికి వెళ్లిపోవాలని సంతోష్ చెప్పాడు. దీంతో వెంట వచ్చిన రవిని తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని యువతి అడిగింది. అతను సరేనంటూ అమీన్ పూర్ లోని తన గదికి తీసుకెళ్లాడు.
రెండు రోజులు అక్కడే ఉన్న ఆమెపై గత నెల 29న మద్యం మత్తులో రవి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మరుసటి రోజు కుటుంబీకులకు ఫోన్ చేసి సికింద్రాబాద్ స్టేషన్ కు రావాలని చెప్పింది. వారు అక్కడికి చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని వివరించింది. దీంతోయువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని ఆరా తీయగా.. రవితో పాటు తన తండ్రి చేసిన అఘాయిత్యంపై పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు రవితో పాటు బాధితురాలి తండ్రిపై కూడా అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ పవన్ తెలిపారు.