05-01-2024 RJ
తెలంగాణ
నారాయణపేట, (జనవరి 5): వయసుతో తేడా లేకుండా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు.. నారాయణపేట జిల్లాలో ఓ యువ ప్రాణాన్ని బలిగొంది. ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి ఒకరు క్లాస్ రూమ్ ముందే కుప్పకూలి.. కన్నుమూశాడు.
హన్వాడ మండలం బుడుమ తండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ (15) ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన శ్రీకాంత్ క్లాస్ కు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ప్రథమ చికిత్సలు చేసిన అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు. గుండె పోటు కారణంగానే శ్రీకాంత్ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు హఠాన్మరణంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరోవైపు శ్రీకాంత్ మృతితో బుడుమలో విషాదఛాయలు అలుముకున్నాయి.