05-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు, (జనవరి 5): తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అదే ప్రమాదంలో ఆయన పీఏ వెంకటేశ్వర్లు మృతి చెందారు. విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తున్న క్రమంలో హైవేపై ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆయన్ను వెంటనే నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగింది. రేగడి చెలిక గ్రామ సమీపంలో హైవేపై వెళ్తున్న ఓ లారీ టైరు పంక్చర్ కావడంతో అది అకస్మాత్తుగా స్లో అయింది. ఆ లారీ వెనక వస్తున్న ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేశాడు.
అయినా కూడా ఆ స్పీడ్ లో లారీని కారు వెనక నుంచి ఢీకొంది. ఆ తర్వాత డివైడర్ పై పల్టీ కొట్టింది. చంద్రశేఖర్ రెడ్డి పీఏ వెంకటేశ్వర్లుకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో అయిదుగురు ఉన్నారు.
గాయాలపాలైన వారందర్నీ నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ప్రమాదం అనగానే నెల్లూరు జిల్లా నేతలంతా ఆస్పత్రికి తరలి వచ్చారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు.
రోడ్డు ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయాలయ్యాయి. ఆయన్ను ప్రమాద స్థలం నుంచి వెంటనే నెల్లూరుకి తరలించి అత్యవసర చికిత్స అందించారు. దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం విజయవాడలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి బిజీబిజీగా గడిపారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని, పాఠశాల విద్య కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ని కూడా కలిశారు. ఉపాధ్యాయ సమస్యల గురించి సజ్జలతో ప్రత్యేకంగా చర్చించారు.