05-01-2024 RJ
సినీ స్క్రీన్
తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సినిమాల విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొని ఉంది. తెలుగు, తమిళం కలిపి దాదాపు 10 సినిమాలు ఈ సంక్రాంతి పండుగ రోజున విడుదలకు సిద్ధమవడంతో నిర్మాతలతో పాటు ప్రేక్షకుల్లో సైతం ఏం జరుగబోతున్నదనే ఆసక్తి ఏర్పడింది. సినిమాలు ఎవరైనా వాయిదా వేసుకుంటారా అని ప్రతి ఒక్కరూ వేయి కళ్లతో ఎదురు చేశారు. ఈ క్రమంలో ముందుగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాను వాయిదా వేసుకోగా తాజాగా ఈ రోజు రవితేజ నటించిన ఈగల్ సినిమాను వాయిదా వేయనున్నట్లు ప్రకటించారు.
అయితే కొద్దిరోజుల క్రితం తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు నేతృత్వంలో కొన్ని రోజులగా చిత్ర నిర్మాతలతో మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఇందులో ఎవరో ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకోవాలని, లేదంటే అన్ని సినిమాలకి థియేటర్స్ దొరకటం కష్టం అవుతుందని, ఆ తరువాత ఎవరినీ నిందించ వద్దనీ చెప్పగా ఎవరికీ వారు తాము వెనక్కి తగ్గేది లేదని, అందరమూ సంక్రాంతి తేదీకే ఫిక్స్ అయ్యామని ఆ రోజే విడుదల చేస్తామని భీష్మించుకు కూర్చున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ పోటీ నుంచి రవితేజ తప్పుకుంటున్నట్టుగా తెలిసింది. దీంతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో కాస్త క్లారిటీ వచ్చింది.
ఈ సందర్భంగా జరిగిన సమావేశం అనంతరం దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ లు మాట్లాడుతూ సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో మీటింగ్ పెట్టామని, 2023 సంక్రాంతికి మూడు సినిమాలకే ఇబ్బంది అయిందని, ఇప్పుడు 5 సినిమాలు పోటీలో ఉండడంతో నిర్మాతలందరం చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదని అన్నారు. 15 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి గ్రౌండ్ రియాలిటీ చెప్పామని, ఈ రోజు మరోసారి రిలీజ్ విషయంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకునేందుకు తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరు కలిసి చర్చించామని ఈగల్ సినిమాను పోస్ట్ పోన్ చేసేందుకు హీరో రవితేజ నిర్మాతలు ఒప్పుకున్నారన్నారు.
రవితేజ సపోర్ట్ ను చూసి అభిమానులు గర్వపడాలని అన్నారు. రవితేజ, ఈగల్ సినిమా నిర్మాత పీపుల్స్ మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఫిభ్రవరి 9న ఈగల్ సినిమా విడుదల ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు సంక్రాంతికి 'హనుమాన్', గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' నాలుగు సినిమాలు మాత్రమే బరిలో ఉండనున్నాయి.