06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్ లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్ కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని వెల్లడించారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లపై కేసీఆర్ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దులు చేస్తూ వాయిదాలు వేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదని అన్నారు.
ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతుబంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్పచారం వల్ల ఓడిపోయామని అన్నారు. మొన్నటి ఎన్నికలు కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటిదని అన్నారు. 'తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, సత్తా ఏమిటో చూపిద్దామని ' కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని, ముందు ముందు మంచి రోజులు వస్తాయని అన్నారు.