06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): ఘట్ కేసర్ లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. గంజాయికి బానిసై బీటెక్ విద్యార్థి విజయ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీబీనగర్ వైపు నుంచి సనత్ నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని.. అతని వద్ద లభించిన పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాల ఆధారంగా మృతుడు నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి విజయకుమార్(27)గా గుర్తించారు.
ఈ క్రమంలో కళాశాల నిర్వాహకులకు, పెద్ద చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాసు పోలీసులు సమాచారం ఇచ్చారు. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విజయ్ కుమార్ ఇంటర్ నుంచే గంజాయికి అలవాటుపడ్డాడు. అయితే నగరంలో పోలీసులు కట్టడితో గంజాయి లభించక పోవడంతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థి ఇలా ప్రాణాలు తీసుకున్నాడు. గంజాయిని మానిపించేందుకు కుటుంబసభ్యులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. చెడు అలవాట్లకు బానిసైన విజయ్ దానిలో నుంచి బయటపడలేకపోయాడు.
చదువుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు అతడిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. అయితే ఇటీవల కాలంలో గంజాయి దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన విజయ్ కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్కేసర్లోని ఓ కళాశాలలో డిప్లమో చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటుపడినట్లు, తరువాత పాతబస్తీలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించగా.. అక్కడగా వ్యసనానికి బానిసైనట్లు తండ్రి శ్రీనివాస్ తెలిపారు.
మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు మానిపించి చర్లపల్లిలో చికెన్ సెంటర్ పెట్టించారు. విజయ్ కుమార్ మానసికంగాను కుంగిపోవడంతో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఎడిక్షన్ కేంద్రంలో చికిత్స చేయిస్తున్నారు. అయినా పూర్తిగా కోలుకోకపోగా.. చదువుకుంటానని చెప్పడంతో నార్లపల్లిలోని కళాశాలలో రెండో సంవత్సరంలో చేర్పించారు. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు.
కొద్ది నెలలుగా తన మనసు బాగుండటం లేదని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండటంతో తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. అయినా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.