06-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (జనవరి 6): సుమారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరునెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది. సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది.
అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసులు కిందకు రానప్పటికీ... వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తారని సర్కార్ పేర్కొంది.
1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్వాడీలను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సమ్మెలో ఉన్నవారిపై ప్రాసిక్యూషన్ కు అవకాశం ఉంటుంది. సమ్మె చేసిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరపింది. పలు డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే అన్ని డిమాండ్ పరిష్కారం వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. జీతాల పెంపు, గ్రాట్యుటీ పెంపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. వారితో దఫదఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం వారి డిమాండ్లపై క్లారిటీ ఇవ్వలేకపోయింది.
ఆర్థికంగా ప్రభావం పడని వాటికి ఓకే చెప్పింది కానీ జీతాల పెంపుపై వారికిహామీ ఇవ్వలేదు. అందుకే అంగన్వాడీ వర్కర్లు సమ్మె విరమించడం లేదు. ప్రభుత్వం చర్చలు జరిపినా, బెదిరించినా సమ్మె విరమించడం లేదని ఇప్పుడు అంగన్వాడీల సేవలను అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో రిలీజ్ చేసింది. అంతే కాకుండా ఇలాంటి సర్వీసుల్లో ఉన్న వారు ఆరు నెలల పాటు సమ్మెలు చేయకూడదని ఎస్మాని ప్రయోగించింది.
ఈ మేరకు జీవో నెంబర్ 2ను రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి సమ్మెలు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంగన్వాడీలను డిస్మిస్ చేయవచ్చు. అంతే కాదు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు కూడా పెట్టవచ్చు. ఈ కేసుల్లో సమ్మెచేసిన వారికి ఆరు నెలలు, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం అంగన్వాడీల జీతాల్లో కూడా కోత పెట్టింది. అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు వేతనాల్లో మూడు వేలు తగ్గించి వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.