06-01-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, (జనవరి 6): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అడ్డుపుల్లల వేస్తూ అవినీతిని కప్పిపుచ్చుకునే కుట్రలకు దిగుతోందన్నారు. శనివారం నాడు ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించకపోతే బాగుంటుందని..
బీఆర్ఎస్, బీజేపీ కలలు కంటున్నాయని.. వారి కలలను నిజం కానివ్వబోమని త్వరలోనే హామీలను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. డిసెంబర్ 28వ తేదీన కాంగ్రెస్ ఆవిర్భవించిందని.. అదే రోజున 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఎన్నికల ముందు ప్రకటించామని హామీలను తప్పకుండా అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించారని అందుకనే ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు.
తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అదేవిధంగా పేదలకు మెరుగైన వైద్యం అందాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కావలసిన బడ్జెట్ ప్రిపరేషన్ కోసమే ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి అర్హులైన ఏ ఒక్కరికీ కూడా ఇంటి స్థలం ఇవ్వలేదని.. కొత్త ఇళ్లను నిర్మించలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, భవిష్యత్తు తరాలను తాకట్టుపెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అసెంబ్లీలో శ్వేత పత్రాలను విడుదల చేశామని చెప్పారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా.. అన్న బీఆర్ఎస్ కు చెంపపెట్టు లాగా కరెంటు కావాలి.. కాంగ్రెస్ కావాలి అని ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు.
విద్యుత్తు రంగంపై 1.10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని గత ప్రభుత్వం మోపినప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.