06-01-2024 RJ
తెలంగాణ
జగిత్యాల, (జనవరి 6): కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయడం బిజెపికి కూడా ఇష్టం లేనట్లుగా ఉందిన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోసం బీజేపీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యూడిషియల్ విచారణకు కాంగ్రెస్ ఆదేశిస్తే బిజెపి భుజాలు తడుముకుంటోందని మండిపడ్డారు. సిబిఐ విచారణతో కేసు క్లోజ్ చేయాలన ఇచూస్తోందని మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ను కాపాడటం కోసమే సీబీఐని వాడుతోందని ఆరోపించారు.
కేసీఆర్ తప్పులు బయటపడకుండా బీజేపీ జాగ్రత్త పడుతోందన్నారు. కవిత కేసును కావాలనే తొక్కి పెట్టారన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు. బీజేపీ - కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని మొన్నటి ఎన్నికల్లో రుజువు అయ్యిందని గుర్తు చేశారు. కేసీఆర్ తలను సీబీఐ చేతిలో పెట్టారన్నారు. కాళేశ్వరం ఒక డొల్ల ప్రాజెక్టు అని.. కాళేశ్వరంపై న్యాయ విచారణ తప్పదని స్పష్టం చేశారు. బీజేపీ - కేసీఆర్ విధానాలను మేథావులు, న్యాయ కోవిధులు గమనించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
కెసిఆర్ అవినీతిపై ఏనాడూ బిజెపి ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. దమ్ముంటే గత పదేళ్లలో ఎందుకు ఆదేశం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ విచారణకు దిగితే అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. బిజెపి తీరు ఇలాగే ఉంటే ప్రజలు ఛీత్కరించుకుంటారని అన్నారు.