06-01-2024 RJ
తెలంగాణ
మెదక్, (జనవరి 6): తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పేదలకు న్యాయం చేస్తామని అన్నారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్ విధిగా భావిస్తోందని స్పష్టం చేశారు. శనివారం మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం రూ 10 లక్షలతో ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తోందని, ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు అందజేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉందని పేర్కొన్నారు.
గత కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ పాలనను ప్రజలకు అందించామని వివరించారు. రాజకీయం శాశ్వతం కాదని వ్యవస్థ ముఖ్యమని అన్నారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉన్న కాలంలో మోడల్ స్కూల్స్, కేజీబీవీలను ఏర్పాటు చేశామని తెలిపారు.