06-01-2024 RJ
తెలంగాణ
సిద్దిపేట, (జనవరి 6): మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్లు మంజుల రాజనర్సుపై అసంతృప్తి ఉందని వస్తున్న వార్తలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఖండించారు. సిద్దిపేట మున్సిపల్లో అవిశ్వాసం అనే మాటే లేదని స్పష్టం చేశారు. చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేల్చిచెప్పారు. సిద్దిపేటలో ఎప్పటికీ ఎగిరేది గులాబీజెండానే అని బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ అవినీతి చేశారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమని చెప్పారు.
అవినీతి నిరూపించకుంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమా? అని కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ హామీలు సాధ్యం కాక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేసిన తర్వాత మాట్లాడాలని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు మీవెంటే పడతామని.. ప్రజలవైపు నిలుస్తామని స్పష్టం చేశారు.