06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు విశేష స్పందన లభిస్తోంది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో వాహనాదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76లక్షలకు పైగా చలాన్లను క్లియర్ చేసుకున్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ కట్టాల్సి ఉండగా..
ఇప్పటి వరకు 77 లక్షల చలాన్లు క్లియర్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ చలాన్లకు సంబంధించి శనివారం వరకు రూ.67 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషరేట్ లో రూ. 18 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్లో రూ.14 కోట్లు, రాచకొండ కమిషనరేట్ లో రూ. 7.15 కోట్లు వసూలయ్యాయని చెప్పారు.
ట్రాఫిక్ చలాన్ల వెబ్ సైట్ లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఫేక్ చలాన్ వెబ్ సైట్లను నిలిపివేశామని తెలిపారు. మరోవైపు.. చలాన్ల పెండింగ్ పై వాహనదారుల స్పందనను గమనించిన ప్రభుత్వం.. చలాన్ల చెల్లింపులపై మరింత వెసులుబాటు కల్పించింది. ఈనెల పదో తేదీ వరకు డిస్కౌంట్ తో చలాన్లను చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది.