06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): తన కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. జనవరి 6వ తేదీ శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న షర్మిల.. ఆయనను కలిసి.. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత షర్మిల తొలిసారి ఆయనను కలిశారు.
షర్మిల తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అధిష్టానం.. ఆమెను ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షరాలిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏపీలో పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.