06-01-2024 RJ
సినీ స్క్రీన్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'తండేల్' సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి చందూ మొండేటి దర్శకుడు, ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. చిత్ర నిర్వాహకులు ఈ సినిమా మొదటి ప్రచార వీడియో విడుదల చేశారు. నాగ చైతన్య సముద్రం మీదకి చేపలు పట్టడానికి వెళితే, తప్పిపోయి పాకిస్తాన్ దేశానికి వెళ్లి అక్కడ సైనికులకు దొరికిపోతాడు.
అక్కడ పాకిస్తాన్ జైల్లో నాగ చైతన్య ఉంటే, ఇక్కడ అతని ప్రియురాలు సాయి పల్లవి సముద్రం ఇవతలి ఒడ్డున అతనికోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ ప్రచార చిత్రాలు ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా తీయడమే కాకుండా, అవి ఎంతో ఉన్నతమైన సాంకేతికతని కూడా వాడినట్టుగా స్పషంగా తెలుస్తోంది. ఎందుకంటే నాగ చైతన్య సముద్రంలోకి వెళ్లడం, పాకిస్తాన్ సైనికులకు దొరికిపోవడం ఇవన్నీ ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.
'తండేల్' కథ నేపధ్యం శ్రీకాకుళం దగ్గర జరిగిన ఒక కథ ఆధారంగా తీసుకొని నిర్మిస్తున్నారు కాబట్టి, నాగ చైతన్య శ్రీకాకుళం యాస కూడా బాగానే మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. 'దద్దా గుర్తెట్టుకో, ఈపాలి ఏట గురితప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే' అని మాటతో ప్రారంభం అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం ఈ చిత్రాలకి మంచి తోడ్పాటు అందించటమే కాకుండా, ఆసక్తికరంగా ఉండేట్టు చేసింది.