08-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి, జనవరి 08: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాక ఎపిలో కాంగ్రెస్ నేతలు చురుకుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేతలు మంతనాలు జరుపుతూ చురుకుగా మారారు. ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తను ప్రతక్ష్య రాజకీయాల్లోకి రానంటూనే రాజమండ్రిలో ప్రత్యక్ష మయ్యారు. ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశం అయ్యారు.
ఈ సమావేశం రాజకీయంగా కలకలం రేపుతోంది. లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఆ మాట మేరకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.
అయితే ఏపీకి వచ్చినప్పుడు మాత్రం రాజకీయ స్నేహితుల్ని కలుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆయన రాజకీయంపై చర్చ జరుగుతూ ఉంటుంది. షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసిన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజమండ్రికి రావడం ఇద్దరు సీనియర్ మాజీ ఎంపీలతో సమావేశం కావడం సహజంగానే ఆసక్తి రేపుతోంది. హర్షకుమార్ కాంగ్రెస్ లోనే ఉన్నారు.
కానీ ఆయన యాక్టివ్ గా లేరు. షర్మిలను చీఫ్ చేస్తారన్న ప్రచారం తర్వాత ఆయన వ్యతిరేకంగా స్పందించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఊడిగం చేయడానికే ఏపీ కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఏ పార్టీలో లేరు.
కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీలో పని చేసిన ఆయన తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ అధినేత జగన్ కు సానుకూలంగా మాట్లాడుతారన్న అభిప్రాయం ఉంది. అయితే ఆయన అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఆయనకు రాజ్యసభ, ఎమ్మెల్సీ లాంటి పదవులు కూడా వైసీపీ ఆఫర్ చేయలేదు.
ఇప్పుడు హర్ష కుమార్ తో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ ను మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ అయ్యేలా చూసేందుకు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఒప్పించేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. షర్మిలకు మద్దతుగా సైలెంట్ గా ఉండిపోయిన కాంగ్రెస్ నేతల్ని లగడపాటి తెరపైకి తెస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే లగడపాటి రాజగోపాల్ మాత్రం.. అలాంటిదేమీ లేదంటున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెబుతున్నారు.
రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిపోయిందని.. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని ఆయన చెబుతున్నారు. ఓ కార్యక్రమం కోసం రాజమండ్రి వచ్చానని.. ఎప్పుడు రాజమండ్రి వచ్చినా హర్ష కుమార్ ను.. ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలవడం సహజమేనని చెబుతున్నారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఎప్పటిలా స్తబ్దుగా ఉండకుండా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేలా చూసేందుకు తెరవెనుక మంత్రాగంం జరుగుతున్నట్లుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
అయితే తాను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను లగడపాటి రాజగోపాల్ సోమవారం నాడు కలిశారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ...
కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని.. అక్కడికి వెళ్తూ.. మర్యాదపూర్వకంగా హర్షకుమార్ను కలిశానని తెలిపారు. ప్రజల కోసం వారి అవసరాల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు తాము పూర్తిగా విభేదించామని తెలిపారు.
తాను రాజకీయాల నుంచి తప్పుకునా ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్లకి మద్దతు ఇస్తానని తెలిపారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసిన వారి తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. గతంలో జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని తెలిపారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు.
తనకు రాజకీయంగా పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తనకు చాలా సంతోషకరమన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఆలోచనే లేదని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు.