08-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 08: దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కిషన్ రెడ్డి సమక్షంలో నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోటీ లేదని.. మూడోసారి మోదీ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పారు.
దేశ ప్రజలంతా మోదీ మరోసారి రావాలని కోరుకుంటున్నారన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం మౌలిక వసతులు కల్పన అద్భుతంగా జరిగిందన్నారు. మోదీ నూతన భారతాన్ని నిర్మించారని.. దీంతో ప్రపంచంలో దేశ ఖ్యాతి పెరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేశారని తెలిపారు. పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వాని దేనని చెప్పారు. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ను మోదీ ప్రపంచానికి అందించారన్నారు.
పొదుపు సంఘాలకు 20 లక్షల రుణాలు అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రాంతీయ, కుటుంబ అవినీతి పార్టీలు ఫ్రంట్ పెట్టి పగటి కలలు కంటున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కాదు.. అవినీతి లేని స్థిరమైన మోదీ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని.. మరోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.