09-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 09: లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోనూ మార్పు వస్తుందని బీఆర్ఎస్ నేతల ఆలోచనగా ఉంది. పోటాపోటీ మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయడం సులవుని నమ్ముతున్నారు. అయితే అలాంటి ఉద్దేశం తమకు లేదంటూనే.. అధికార పార్టీ మెజారిటీకి అవసరమైన నాలుగు సీట్లే అదనంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు పదేపదే చెబుతున్నారు.
ముఖ్యంగా కెటిఆర్ తన పార్టీ సమీక్షల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాలేదు. ప్రస్తుత ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తామని, వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అప్పుడు ప్రజల పక్షాన పోరాడుతామని అంటున్నారు. నిజానికి కెటిఆర్ అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
గతంలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ ఎమ్మెల్యేలను గంపగుత్తగా తీసుకుని బలపడ్డామని భావించారు. అలాగే కాంగ్రెసు పడగొట్టేందుకు బిజెపి సహకారంతో ముందుకు వెళ్లాలన్న వ్యూహంలో ఉన్నట్లు తాజా పరిణామాలు, వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో రెండుపార్టీలు కలిసి మెజార్టీ సీట్లు సాధిస్తే రాజకీయం మారుతుందనే అంచనాలు వేస్తున్నారు. బీజేపీ గత రాజకీయ వ్యూహాల్ని ఓ సారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మహారాష్ట్రలో, కర్ణాటకలోనే కాదు.. గతంలో అనేక ప్రభుత్వాలను బీజేపీ సులువుగా పడగొట్టేసింది. అందుకోసం.. బీజేపీ సరైన సమయం కోసం చూసింది.
ఆ సరైన సమయం ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను లాక్కోవడం మాత్రమే. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది సీట్లు గెలవకపోతే కాంగ్రెస్ పై ప్రజల్లో భరోసా లేదన్న ప్రచారం చేయొచ్చన్నది కూడా వ్యూహంలో భాగంగా ఉంది. అలాంటప్పుడే ఆపరేషన్ కమల్ ప్రారంభం అవుతుంది. బీఆర్ఎస్ ఇందుకు సహకరిస్తుంది.
ఎందుకంటే ఈ రెండు పార్టీలకు కలసి 47 సీట్లు ఉన్నాయి. కేవలం 13 సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. అందులో ఓ ఏడు సీట్లు మజ్లిస్ ఇవ్వొచ్చు. ఖచ్చితంగా ఇదే జరగాలని, జరిగేలా చూడాని బీఆర్ఎస్ కోరుకుంటోంది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కనీస సీట్లు సాధించలేకపోతే... బీఆర్ఎస్ నైతికంగా అప్పటికే బలహీనపడుతుంది.
ఆ పార్టీ నేతల వలసల్ని ఆపడం తేలిక కాగలదు. బీజేపీ మిగతా పని పూర్తి చేసి.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీ అన్నట్లుగా వాతావరణం మార్చుకుంటుంది. ఈ రెండు పార్టీల ముఖాముఖి పోరులో.. బీజేపీ లాభపడాలని చూస్తుంది. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఎదురు తిరగనూ వచ్చు.
బీఆర్ఎస్ ను నమ్మితే మాత్రం బిజెపికి వచ్చే లాభం ఉండకపోవచ్చు. ఇదిలావుంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి నెలరోజులు గడుస్తున్నా.. ఓటమికి కారణాలపై పార్టీ పోస్టుమార్టం చేసుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ లో గెలిచినా.. కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. ఇందుకు కారణాలేంటి..? అధినేతే ఎందుకు ఓడినట్టు అనే విశ్లేషణను కామారెడ్డి వెళ్లి నిర్వహించలేదు.
ఆ సెగ్మెంట్ నేతలతో హైదరాబాద్ లో కూడా చర్చించలేదు. మంత్రులు, కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి వెనుక కారణమేంటన్నదీ విశ్లేషించుకోలేదు. అవన్నీ పక్కన పెట్టి.. లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతుండటం చర్చనీయాంశమైంది. సమావేశాల్లో కూడా ఓటమికి కారణాలను మాజీ ఎమ్మెల్యేలపైకి నెట్టేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం మేమెలా అవుతామని ఓటమి చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారు. గెలిస్తే తమ ఖాతాలో వేసుకోవడం, ఓడితే మాపై నెట్టడం ఎంతవరకు సమంజసమని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు బాధ్యత లేదా అన్న నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదే గులాబీ దళంలో హాట్ టాపిక్ గా మారింది. ధరణి, దళితబంధు, నియంతృత్వ విధానాలు పార్టీ ఓటమికి కారణం కాదా..? అని మాట్లాడుతున్నారు.
ఎమ్మెల్సీ కవిత అవినీతి వ్యవహారంపైనా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. ప్రజల్లో అప్రతిష్ట తెచ్చిపెట్టిన తీరు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతోంది. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరును కూడా చర్చిస్తున్నారు.
ఇంటెలిజెన్స్ రిపోర్టులను పక్కన పెట్టి మహాద్భుతం జరుగుతుందని, ఫలితాల మరుసటి రోజు వరకు చేసిన ట్వీట్లు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకత ఏర్పడిందో అర్థం చేసుకోకుండా తప్పును తమపైకి నెట్టేయడం ఎందుకని ఫైర్ అవుతున్నారు. ప్రచార సభల్లో కేసీఆర్ కూడా తనను చూసే ఓటేయాలని పిలుపునిచ్చారు.
పైగా కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగిన కామారెడ్డిలోనూ ఆయనకే ఓటమి తప్పలేదు. ఇది కేసీఆర్ పాలనకు వచ్చిన ఫలితమని విశ్లేషణలు వచ్చినా, తమపై రిమార్క్ రావడాన్ని అగ్రనేతలు ఇష్టపడడం లేదు. ఓడిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపైనే నెపం నెట్టేస్తున్నారని నేతలు ఆవేదనతో ఉన్నారు.