09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 09: ఏటా సంక్రాంతి పండగకు ముందు కోడిపందాలపై వివాదం చెలరేగు తూనే ఉంది. తమిళనాట జల్లికట్టు... మన దగ్గర కోడిపందాలు వివాదం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ యేడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలకు అడ్డుకట్ట వేయాల్సిందే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహించరాదని హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఆదేశాలు ఉంటాయని అంటున్నారు. తమిళనాట జల్లికట్టుకు లేని ఆంక్షలు కోడి పందాలకు ఎందుకని కొందరు వాదిస్తున్నారు. అసలు పందేలు ఉంటాయా ఉండవా అన్న సందేహం మరోమారు తెరపైకి వచ్చింది.
అయితే కోనసీమ వాసులను ఎవరిని అడిగినా కోడిపందెం లేనిదే సంక్రాంతి లేదంటారు. కోడిపందాల మజా అంటేనే పండగ అంటారు. తమిళనాడు వాసులకు జల్లికట్టు కూడా అలాంటిదే. గతంలో జల్లికట్టుకు సంబంధించి ఎంత రాద్దాంతం జరిగిందో ప్రజలు మరచిపోయి ఉండరు. సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణ విషయమై ఏటా ఎవరో ఒకరు కోర్టుకు పోవడం దానిపై ఉత్తర్వులు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఏటా కోడి పందేలు ఒక మెగా ఈవెంట్ లా మారిపోతున్నాయి. పందేలు నిర్వహిస్తున్న ప్రాంగణం అంతా బస్సులు, కార్లతో నిండిపోవడం చూస్తే, ఎంత పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారో అర్థం అవుతుంది. ఏటా జరుగు తున్న తంతును గమనిస్తే పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రాంతాలపై అధికారులు దాడులు చేయడం కూడా ఏటా పరిపాటి వ్యవహారంగానే సాగుతోంది. బరులు లేకుండా కత్తి కట్టకుండా పందాలు నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని గతంలో ఆదేశాలు కూడా వచ్చాయి. ఇదంతా మామూలే అన్న ధరోణిలో ఛోటామోటా నేతలు ఉన్నారు. అందుకే సంక్రాంతి కోడి కోసం ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. ఎవరికి వారు సర్దుకు చెప్పుకుని పందెం కోళ్లను రెడీ చేస్తున్నారు. అందుకే సంక్రాంతి పందెం కోడి కూయబోతోంది. మరోవైపు పందాలపై ఇప్పటి నుంచే నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ముందస్తు అరెస్టులు చేస్తామని అంటున్నారు. పందాలు నిర్వహించవద్దంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కోడి పందేల నిర్వాహకులు మాత్రం ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ వీటి నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా డెల్టా, మెట్ట ప్రాంతాల్లోని నిర్వాహకులు పైరవీలు ప్రారంభించారు. సంక్రాంతి పండగ సందర్భగా జరిగే కోడిపందాలకు పశ్చిమ పెట్టింది పేరు. ఇక్కడ ఎన్ని అవాంతరాలు ఉన్నా పందాలు జరిగి తీరాల్సిందే అన్న రీతిలో సాగుతున్నారు. కోర్టు ఆంక్షలు ఉన్నా, పోలీసుల నిఘా పెరిగినా బరులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బరులను సిద్ధం చేస్తున్నారు. ఓ పక్క పోలీసు యంత్రాంగం హెచ్చరికలు చేస్తున్నా.. మరోపక్క నిర్వాహకులు బహిరంగం గానే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సంక్రాంతి మూడు రోజులు 13 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో లాడ్జిలు నిండిపోతాయి. గతేడాది కోడి పందాలు నిలువరించేందుకు భోగి పండుగ రోజు పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినా చివరకు రాజకీయ నాయకుల ప్రభావం ముందు నిలవలేక చేతులెత్తేశారు. ఈ ఏడాది కూడా అదే జరుగుతుందనే ప్రయత్నాల్లో పందెంరాయుళ్లు ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేకంగా కోళ్లను పెంచి వాటికి ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారు. సంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడిపందేలు నిర్వహించే ప్రాంతాల్లో కోడి పందేలు లేకపోతే పండగ సరదా ఏముందన్న వాదన ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా భోగి రోజు మాత్రం కోడికి కత్తి కట్టాల్సిందే.
ఇతర జిల్లాల నుంచి వచ్చే పందేగాళ్లకు తగిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు చేరవేస్తున్నారని తెలుస్తోంది. ఆయాచోట్ల బరులను లోపాయకారిగా సిద్ధం చేస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో నియోజకవర్గం వ్యాప్తంగా మండలాల్లోని పలు గ్రామాల్లో కోడిపందేలు ఆడించేందుకు స్థానిక నాయకులు వేగంగా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.