09-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 09: ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. నేడు ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారి పోయామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని.. సమీక్షించుకుని ముందుకు సాగుతామని తెలిపారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీపిని తిరస్కరించి కాంగ్రెస్ ను గెలిపించారు. కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద జనం విశ్వాసాన్ని కోల్పోయారు. నాటి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదు.
గత నెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి ఇది రుజువైంది. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ వత్తిడి తెస్తోంది' అని కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఓడి పోయామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి నేతల మధ్య వర్గ విభేదాలు పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. లేకపోతే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.