09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
హిందూపురం, జనవరి 09: హిందూపురం పట్టణంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత తెదేపాదేనని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. హిందూపురం మున్సిపాలిటీలోని వార్డుల వారీగా నాయకులతో బాలకృష్ణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైకాపా పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని..
ఆ పార్టీ చేసిన అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై వైకాపా ప్రభుత్వం దాడులు చేస్తోందని బాలకృష్ణ ఆరోపించారు. హిందూపురంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల పోరాటానికి తెదేపా అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని.. ఉరవకొండలో పాత్రికేయులపై దాడి వైకాపా పైశాచికానికి నిదర్శనమన్నారు. ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు.