09-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, జనవరి 09: నాలుగున్నరేళ్ల పాలనలో మధ్యతరగతి ప్రజలను పేదరికంలోకి, పేదలను మరింత పేదరికంలోకి జగన్ ప్రభుత్వం నెట్టేసిందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ ఆరోపించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెయ్యి ప్రెజర్ కుక్కర్లు అందజేశారు. తమకు మేలు చేస్తాడని ఆశపడి ఓట్లేసిన ప్రజలకు నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ నరకం చూపిస్తున్నాడని, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయిన చందంగా ఆయన పరిపాలన ఉందని ఎద్దేవా చేశారు.
పేదలకు అండగా నిలిచేందుకు తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత పదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. పేదలపై, సామాన్య ప్రజలపై అధికంగా పన్నులు వేసి పీక్కుతినడమే కాకుండా నిత్యావసరాల ధరలతో పాటు పన్నులను భారీగా పెంచి దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చెత్తపై పన్ను, మరుగుదొడ్డిపై పన్నులు వేసి ప్రజల్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని మన్నవ మోహనకృష్ణ ఆరోపించారు. పేదలు, రోజువారీ కూలీల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందని, సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని, పేదలను సంపన్నులను చేయగలిగిన సత్తా తమ పార్టీకే ఉందన్నారు. తెదేపా అధికారంలోని వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500, ప్రతి ఇంట్లో చదువుకుంటున్న బిడ్డలకు ఏడాదికి రూ.15,000 ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు మహిళలంతా ఎదురుచూస్తున్నారని మన్నవ మోహన కృష్ణ అన్నారు.