09-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 09: జైలులో నాలుగు గోడల మధ్య ఉండలేక ఎలాగైన బయటపడాలని ప్లాన్ వేశాడు ఓ ఖైదీ. అయితే, అది కాస్త అతని ప్రాణం మీదకు వచ్చింది. నగరంలోని చంచల్ గూడ జైలులో ఓ ఖైదీ అస్వస్థతకు గురికావడంతో... జైలు సిబ్బంది ఆ ఖైదీని చికిత్స కోసం వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, సదరు ఖైదీకి ట్రీట్మెంట్ చేస్తూ వైద్యులు షాకయ్యారు. ట్రీట్మెంట్ ఎగ్జామినేషన్ చేసి కడుపులో మెటల్ నెయిల్స్, టేపులను వైద్యులు గుర్తించారు.
దీంతో ఎండోస్కోపీ ఫారెన్ బాడీ రిమూవల్ ట్రీట్మెంట్ ద్వారా మెటల్ నెయిల్స్, పొట్లాలను తొలగించారు. ప్రస్తుతం ఖైదీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కడుపులో ఉన్న టేపులు, మెటల్ నెయిల్స్ ను విజయవంతంగా తొలగించిన వైద్యుల బృందాన్ని ఉస్మానియా హాస్పిటల్ సూపరిడెంట్ నాగేంద్ర అభినందించారు. అయితే, జైల్ నుంచి బయటకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఖైదీ సోహెల్.. ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.