10-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 10: నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకొనే క్రమంలో పట్టాలు తప్పింది. ఒక్కసారిగా కుదుపుకు గురై ప్లాట్‌ఫాం సైడ్ గోడలను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. కొంతమందికి గుండెపోటు రావడంతో లాలాగూడ రైల్వే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కేకలువేస్తూ ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు.
ప్రమాదంలో మూడు ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం ఘటనపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపింది. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు సమాచారం. దీంతో డెడ్ ఎండ్ లైన్ ప్రహరికి చార్మినార్ ఎక్స్ ప్రెస్ తాకింది. ఈ సంఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.