10-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
భీమవరం, జనవరి 10: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ అంటేనే కోడిపందాలు. ఈ పండుగ సందర్భంగా దాదాపు ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోడిపందాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో కోడిపందాలు నిర్వహించకూడదని అక్కడి పోలీసులు ఆదేశాలు జారీచేశారు.
ఆదేశాలు మీరిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేగాక పందాల నిర్వహణ కోసం ఇప్పటికే సిద్ధం చేసిన కోడిపందాల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. గత ఏడాది కోడిపందాలు, ఇతర జూదాల్లో పాల్గొన్న 400 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కోడిపందాలకు స్థలాలు ఇచ్చేవారిపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు కోడిపందాలకు స్థలాలు ఇస్తున్న యజమానులకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు.