10-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 10: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న అధికారపార్టీ మార్పులు చేర్పుల అంశం తుది అంకానికి చేరుకుంది. సిట్టింగ్లకు దాదాపు పలుచోట్ల టిక్కెట్ నిరాకరణ జరుగుతోంది. నిర్మొహమాటంగా టిక్కెట్ లేదని చెప్పేస్తున్నారు. పలువురు ఎంపిలకు, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవని చెప్పడంతో పాటు పలువురి స్థానాలను మార్చేస్తున్నారు. ఈలోపు ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు.. సీఎం ఆఫీసుకు క్యూ కడుతున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మార్పులు చేర్పుల విషయంలో వైసీపీ మరింత దూకుడుగా ముందుకెళ్తాంది.
ఇప్పటికే రెండు విడతల్లో 40 మంది దాకా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిన అధికార పార్టీ.. 29మందితో మరో జాబితాను విడుదల చేయనుంది. దీనిపై పలువురు నేతలతో చర్చించిన సీఎం జగన్.. భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. క్యాంప్ ఆఫీసుకు నేతలు క్యూ కట్టారు. ఈ లిస్టులో మంత్రులు బొత్స, బుగ్గన, జయరాం.. ఎంపీలు సత్యవతి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. తోట త్రిమూర్తులు, ద్వారంపూడి, అయోధ్యరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తెల్లం బాలరాజు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అధిష్టానం నిర్ణయంపై కొందరు విధేయత ప్రకటిస్తుంటే.. మరికొందరు తమదారి తాము చూసుకుంటు న్నారు.
ఇటీవల వైసీపీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించిన కాపు రామచంద్రారెడ్డి.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని కలిశారు. ఈసారి ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఇక, నిన్నటికి నిన్న సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. సడెన్ గా స్వరం మార్చారు. తాను జగన్ ను ఒక్క మాటా అనలేదనీ.. కేవలం అధికారుల తీరుపైనే తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని ఎంపీలు గోరంట్ల మాధవ్, నందిగం సురేష్ అంటున్నారు.
అటు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైనా వైసీపీ కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ముగ్గు సభ్యులను దాదాపు ఖరారు చేసిన వైసీపీ.. ఓసీ వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గొల్ల బాబురావు, బలిజ వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాసిని ఎంపిక చేసింది. అయితే రాబోయే జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు పోతాయన్నది ఉత్కంఠ కొనసాగుతోంది.