10-01-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, జనవరి 10: ప్రజా పాలనతో పాటు మనం కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మల్లెలమడుగులో పల్లె దవాఖానా ప్రారంభోత్సవం సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంతో పేదలకు మంచి జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మాటలతోనే కాకుండా పేదలకు ఇచ్చిన గ్యారెంటీలను చేసి చూపిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వస్తారని పొంగులేటి తెలిపారు.
ప్రజా పాలనలో దరఖాస్తులతో పేదల న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం తీర్చుతుందన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి పోయిందని మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పేదలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చుతామని పొంగులేటి తెలిపారు.
బీఆర్ఎస్ రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. టిఎస్పిఎస్సి ప్రక్షాళనకు తొలి అడుగు పడిందని, గతంలో నిరుద్యోగులు వివక్షకు గురయ్యారని, నిరుద్యోగులందరూ కలిసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.