10-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 10: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా ప్రకటించిన అంబటి రాయుడు కొంత కాలం రాజకీయాలకు విరామం తీసుకుంటానని చెప్పారు. అయితే హఠాత్తుగా ఆయన హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తనకు దుబాయ్ లీగ్ లు ఉన్నాయని అందుకే రాజకీయాలకు విరామం ప్రకటించానని అన్నారు.
కానీ అది అబద్దమని పవన్ తో భేటీ ద్వారా క్లారిటీ వచ్చినట్లయింది. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికంటే ముందు నుంచి వైసీపీతో రాయుడు టచ్లో ఉన్నాడు. ఆయన ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించిన ఇండియా సిమెంట్స్ ఓనర్ శ్రీనివాసన్తో సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల కారణంగా రాయుడు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లుగా చెప్పారు. ఆయనకు గుంటూరు ఎంపీ స్థానం ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయించారని.. అందుకే పార్టీలో చేర్చుకున్నారని ప్రచారం జరిగింది. గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కానీ హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పర్యటించిన సమయంలో ఆయన ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఉంటారని.. టీడీపీ జనసేన కూటమికి విజయావకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన వైసీపీక రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. అంబటి రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. జనసేనతో అయితే సర్దుకుపోగలరన్న అంచనాకు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.
పవన్ తో అంబటి రాయుడు సమావేశం వివరాలు పూర్తిగా వెల్లడయిన తర్వాత అంబటి రాయుడు రాజకీయ భవిష్యత్ పై తీసుకునే నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంబటి రాయుడు క్రికెటర్ కావడంతో ఆయనను ఎక్కడ నిలబెట్టినా గెలుస్తారన్న అభిప్రాయంలో ఉన్నారు.
ఆయన స్వస్థలం పొన్నూరు అయినప్పటికీ.. తాతల కాలంలోనే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా లభించే ఏదో ఓ స్థానంలో ఆయనను పోటీ చేయించే అవకాశం ఉండొచ్చు. జనసేన వైపు నుంచి కానీ.. అంబటి రాయుడు వైపు నుంచి కానీ ఇంకా ఎలాంటి స్పందనా ఈ అంశంపై రాలేదు.