10-01-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, జనవరి 10: గత ముఖ్యమంత్రి మాటలకే పరిమితమై ప్రజాసంక్షేమ కార్యక్రమాలు తుంగలో తొక్కారని మాజీ సిఎం కెసిఆర్ పై మంత్రి తుమ్మల విమర్శించారు. ఈనాటి ముఖ్యమంత్రి ప్రజల వద్దకు పంపించి ప్రజల ముందే ఆ కార్యక్రమాలు చేసుకోమని చెప్పారన్నారు. ఆరు గ్యారెంటీలు పేద ప్రజలు కోరుకునే కనీస అవసరాలని చెప్పుకొచ్చారు. ఎంత డబ్బు, అహంకారం, అధికారం ఉన్నా ప్రజల ముందు దిగదుడుపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అందరం ఏది కాదనుకున్నామో, వద్దను కున్నామో దానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులలో ఎవరైతే నిజంగా అర్హులో వారిని గుర్తించాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికారులు కూడా నిజమైన అర్హులకు ఇస్తే అది ఇందిరమ్మ రాజ్యం అవుతుందన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ పంటకాలానికి ఖమ్మం జిల్లాలోకి గోదావరి జలాలు ప్రవేశిస్తాయని స్పష్టం చేశారు.
తప్పకుండా మా పదవీ కాలంలోనే ఆ నీళ్లు మీకు రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమం అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తాము తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.