10-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
బొబ్బిలి, జనవరి 10: రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్ రివర్స్ గేర్ లో పెట్టారని.. ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు పండగ సమయంలో ఉచితంగా సరకులిచ్చామని గుర్తుచేశారు.
తమ హయాంలో పేదల కోసం అన్న క్యాంటీన్లను తీసుకొచ్చి రూ.5కే పేదల కడుపు నింపామని చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన 'రా.. కదలి రా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేదల బలహీనతను ఆసరా చేసుకుని వైకాపా ప్రభుత్వం దోచుకుంటోంది.
అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమని జగన్ చెప్పారు. నిషేధం చేయకపోతే ఓట్లు అడగనన్నారు. ఇవాళ అనేక రకాల మద్యం తీసుకొచ్చి పేదలను దోచుకుంటున్నారు. జగన్ అప్పుల పాపారావు.. విపరీతంగా అప్పులు చేశారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధప్రదేశ్ మార్చేశారు. పిల్లలకు దాన్ని అలవాటు చేశారు. గంజాయి నిర్మూలనపై ఒక్క రోజైనా సీఎం సమీక్ష నిర్వహించారా అని నిలదీసారు. వైకాపా అధికారంలోకి వచ్చాక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు కరెంటు రాదు.. ధరలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి.
తెదేపా తప్పకుండా అధికారంలోకి వస్తుంది.. ఛార్జీలు తగ్గిస్తాం. సౌర, పవన విద్యుత్ను అందుబాటులోకి తీసుకొస్తాం. వినూత్న ఆలోచనలు, పద్ధతులతో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు రూ. 3వేల భృతి చెల్లిస్తాం. జగన్ చెప్పేవన్నీ అసత్యాలే. అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ. 3వేల ఇస్తామని.. జగన్ మాట తప్పారు. 2019లో తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ. 3వేలు ఇచ్చేవాళ్లం.
వైకాపాకు ఓటేస్తే మళ్లీ అందరినీ బానిసలుగా మారుస్తారని చంద్రబాబు ప్రజలను హెచ్చరించారు. రా.. కదలిరా నినాదం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం అని చెప్పారు. తెలుగు ప్రజలు ఐటీలో తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత టీడీపీది అని అన్నారు. తనకు కష్టం వస్తే 90 దేశాలు స్పందించాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రమంతా అన్నా క్యాంటిన్లు పునః ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం వైసీపీ అంటూ మండిపడ్డారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలు పెరగవన్నారు. జగన్ అంటే అప్పుల అప్పారావంటూ వ్యాఖ్యలు చేశారు. గంజాయి అమ్మేస్తున్నారని, మట్టి మింగేస్తున్నారని మండిపడ్డారు. జగన్కు పోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పరిశ్రమలు పెడతామనే వారి నుంచి వైసీపీ నేతలు వాటాలడగటంతో పారిశ్రామిక వేత్తలు పారిపోయారన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. జగన్ నిరుపేద అంట? పాపం ఆయనకి డ్రాయరు కూడా లేదు అంటూ ఎద్దేవా చేశారు.
జగన్ కు ఓటేస్తే బానిసలైపోతామన్నారు. మంత్రి బొత్స ఏం మాట్లాడుతారో ఆయనకే అర్ధం కాదన్నారు. ఉత్తరాంధ్రాలో వెనుకబడిన కులాలను తొక్కేసి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ పట్టం కట్టిందని వ్యాఖ్యలు చేశారు. మన తాత తండ్రుల భూమి పట్టాలపై జగన్ ఫోటో పెట్టారని.. ఆయనేమైన వెంకటేశ్వరస్వామా, ఏసుప్రభువా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ఏ చట్టాన్నైనా ఆమోదించ మన్నారు. వైసీపీ ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుందన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందన్నారు.
అందితే జుత్తు, అందకపోతే కాలు పట్టుకునే సిద్దాంతం జగన్ ది అంటూ విరుచుకుపడ్డారు. బూతులు మాట్లాడే వైసీపీ నేతలకు బహుమానాలన్నారు. జగన్ ది రోత రాజకీయమన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే దెబ్బకి సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుంటే కేసు కూడా పెట్టలేదు సైకో అంటూ విరుచుకుపడ్డారు. తాను వచ్చిన తరువాతే రోడ్లకు మహర్ధశ వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.