10-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 10: తెలంగాణలో కొత్త విద్యుత్ పాలసీ తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సుదీర్ఘంగా సమీక్షించారు.
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 2వందల యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కమ్ల పనితీరు, ఆర్థిక పరిస్థితిపైనా వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ కంపెనీలకు, విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటివాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి వివరాలను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలను, వాటిలోని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కువ ధర చెల్లించే విధంగా జరిగిన ఒప్పందాలకు కారణాలేమిటో కూడా నివేదించాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందో, ఆ కంపెనీల నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటిదాకా సరైన విద్యుత్ పాలసీని రూపొందించడక పోవడంతో వివిధ రకాల ఇబ్బందులు, సమస్యలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు.
వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయాలని, ఆ రాష్ట్రాల్లోని విద్యుత్తు పరిస్థితులు, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, నివేదికలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన విద్యుత్తు విధానాన్ని తెలంగాణలో అమలుచేయడానికి నిపుణులతో చర్చించి, అసెంబ్లీలోనూ అన్ని రాజకీయపార్టీల ప్రజా ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి, సరికొత్త విద్యుత్ పాలసీని తీసుకు వస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్టంగా, ముందస్తు చర్యలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.