11-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ఏలూరు, జనవరి 11: ఎన్నికల సంవత్సరం కావడంతో కోడిపందాలకు జోరు పెరగనుంది. అలాగే చూసీచూడనట్లుగా ఉండాలని నేతలు కూడా చెబుతున్నారు. పందాలకు డోకా లేదన్న భరోసా ఇస్తున్నారు. ఇది ఎన్నికల ఏడాది. ఏమాత్రం పందేలు వద్దన్నా ఆ పార్టీపై ప్రభావం తప్పకుండా పడుతుంది.
దీంతో చూసీచూడనట్లుగా పందేలాను కానిచ్చేలా నేతలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ ధైర్యంతో జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో బరుల ఏర్పాట్లలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. జిల్లాలో పందాల నిర్వహణకు ఎకరాకు ఇంతని రైతులుకు ముట్టచెబుతున్నారు.
సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో బరులు ఏర్పాటులో నిర్వాహకులు మునిగిపోయారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మనజోలికి ఎవరూ రారన్న ప్రచారం సాగుతోంది. లీడర్లే పరోక్షంగా భరోసా ఇస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధిత రైతులను ఒప్పించి వారికి ఎకరాకు రూ.10 వేలు నుంచి రూ.15 వేలు ఇస్తున్నారు.
ఈ ఏడాది మరింత ఎక్కువైంది. పుష్కలంగా నీరుండే డెల్టాలో పందేలకు నిలయంగా మారిన ప్రాంతాల్లో కొన్ని భూముల్లో వరిసాగు చేయకుండా వదిలేస్తున్నారు. జిల్లాలో గతేడాది 500కు పైగా బరులు సిద్ధం చేశారు. ఒకప్పుడు ఉండి మండలం మహాదేవపట్నం, ఆకివీడులలో మాత్రమే బరులు ఉండేవి.
నేడు బరులు లేని ప్రాంతాలు లేవంటే అతిశయోక్తి కాదు. గతేడాది సంక్రాంతికి ఖాళీ కనిపిస్తే చాలు బరి తయారు చేశారు. దాని చుట్టూ జూదాలే. కోడి పందేల మాటున రూ. కోట్లు చేతులు మారితే జూద క్రీడల్లో అందుకు మూడు రెట్లు చేతులు మారాయి. కోడి పందేలు కంటే కోతాట, గుండాట వంటి జూదాలను నిర్వహించుకునేందుకు వాటి నిర్వాహకులతో బరులు సిద్ధం చేస్తున్న వారు ఇప్పట్నుంచే బేరసారాలు మొదలు పెట్టారు. ఇప్పటికే గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కోడిపందేలు కొనసాగుతున్నాయి. ఇవి సంక్రాంతికి నిర్వహించే ప్రధాన పోటీలకు సన్నాహకంగా జూదరులు వ్యాఖ్యానిస్తున్నారు.
గతేడాది కొన్ని బరుల్లో పందేలను ప్రోత్సహిం చేలా ద్విచక్ర వాహనాలను బహుమతిగా ఇచ్చారు. జోడు పందేల్లో విజేతలకు, జూదాల్లో కొందరు బరుల నిర్వాహకులకు ద్విచక్రవాహనాలు అందజేసి సన్మానించారు. ఈ ఏడాది కారును బహుమతిగా ఇవ్వాలని డెల్టా ప్రాంతానికి చెందిన ప్రముఖులు నిర్ణయించారు. గత రెండుమూడేళ్లుగా సంక్రాంతికి భీమవరం పరిసర గ్రామాల్లో కోడిపందేల నిర్వహణ పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఈసారి జిల్లాలో ఎక్కడా జరగకుండా అవసరమైన అన్ని చర్యలు చట్టపరంగా తీసుకుంటామని నివేదికలు ఇచ్చారు. దీంతో కోడిపందేలు, జూదాలు నిర్వహించకూడదని పోలీసు యంత్రాంగం పదేపదే హెచ్చరికలు జారీచేసింది. కోడిపందేల నిర్వాహకులు, కోడికత్తి కట్టే వ్యక్తులపై బైండోవర్ కేసులను ముందస్తుగా నమోదు చేసింది. తహశీల్దార్లు ఏ ప్రాంతంలో కోడిపందేల ఏర్పాట్లు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టింది.
144 సెక్షన్ ను అమలులోకి తీసుకొచ్చారు. గత సంక్రాంతి పండుగ రోజుల్లో కోడిపందేలు, ఇతర జూదాలు విచ్చలవిడిగా జరిగాయని అందుకు కొందరు తహశీల్దార్లను బాధ్యులను చేస్తూ ప్రభుత్వపరంగా భూ పరిపాలన కమిషనర్ ఛార్జిమెమోలు ఇచ్చారు. దీనిపై తమ తప్పిదం ఏమిలేదని ఆటలు జరగకుండా విస్తృత ప్రచారం చేశామని.. బైండోవరు కేసులు నమోదు చేశామని తహశీల్దార్లు వివరణ ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన మెమోలతో తహశీల్దార్లు మదనపడుతున్నారు. ఆటలను అడ్డుకోవాల్సిన పోలీసులకు శాఖాపరంగా పదోన్నతులు లభిస్తుంటే తమకు మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.